మీ చీర కొంగులు మాకు తాకుతున్నాయి!



భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి ఎనిమిది దశాబ్దాలు పూర్తవుతున్న తరుణమిది. సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచంతో పోటీపడుతున్నాం. అంతరిక్ష పరిశోధనల్లో అద్భుతాలు సృష్టిస్తున్నాం. విద్య, వైద్యం, ఆర్థిక రంగాల్లో ప్రగతి సాధిస్తున్నామని గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ, మనిషిని మనిషిగా గౌరవించే సంస్కారం విషయంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉన్నామనే చేదు నిజాన్ని అంగీకరించక తప్పదు.

ఒకవైపు ఆధునికతను ఆహ్వానిస్తూనే, మరోవైపు కులం పేరుతో మనుషుల మధ్య గోడలు కడుతున్నాం. రాజ్యాంగం ప్రతి పౌరుడికీ సమాన హక్కులు కల్పించినా, సామాజిక జీవితంలో మాత్రం ఆ సమానత్వం సంపూర్ణంగా ఆచరణలోకి రావడం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న కులవివక్ష, అంటరానితనం మన సమాజ ప్రగతికి ప్రశ్నార్థకంగా నిలుస్తున్నాయి.

ఒకప్పుడు ప్రజల జీవితాల్లో ప్రధాన సమస్య ఆకలి. రోజంతా కష్టపడితేనే కుటుంబానికి నాలుగు మెతుకులు దొరికేవి. భూమి ఉంటే బతుకు నిలబడుతుందని, కష్టానికి తగిన ఫలితం వస్తుందని ప్రజలు ఆశపడేవారు. కాలక్రమేణా విద్య విస్తరించింది. ఉపాధి అవకాశాలు పెరిగాయి. అట్టడుగు వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, రిజర్వేషన్ల ద్వారా అనేకమంది విద్యావంతులై వివిధ రంగాల్లో రాణిస్తున్నారు.

అయితే, మనుషుల ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు వచ్చినంత వేగంగా వారి ఆలోచనా విధానాల్లో మార్పులు రావడం లేదు. చదువుకున్నవారిలో సైతం కులపరమైన ఆధిపత్య భావజాలం కనిపించడం ఆందోళన కలిగించే విషయం.

మనిషి ధరించే దుస్తులు మారాయి. నివసించే ఇళ్లు మారాయి. జీవన ప్రమాణాలు మారాయి. కానీ ఎదుటివారిని కులం ఆధారంగా అంచనా వేసే సంకుచిత మనస్తత్వం మాత్రం ఇంకా పూర్తిగా మారలేదు. నిజమైన నాగరికత అంటే భవనాల ఎత్తు కాదు.. మనిషి మనసు విశాలత.

పండుగలకు మా డప్పులు కావాలి.. మా భాగస్వామ్యం మాత్రం వద్దా?

గ్రామీణ సమాజంలో కులవివక్ష అనేక రూపాల్లో కనిపిస్తోంది. పండుగలు, జాతరలు, శుభకార్యాలు వచ్చినప్పుడు కొన్ని వర్గాల శ్రమ, కళలు, సేవలు అవసరమవుతాయి. డప్పులు మోగించడానికి, సంప్రదాయ వృత్తులు నిర్వహించడానికి, పండుగల సందడిని పెంచడానికి అట్టడుగు కులాల ప్రజల భాగస్వామ్యం కావాలి. కానీ అదే ప్రజలు సమాన గౌరవంతో పండుగల్లో పాల్గొనడానికి ప్రయత్నిస్తే కొందరిలో వివక్ష బయటపడుతోంది.

బోనాల పండుగకు మాదిగల డప్పులు కావాలి. కానీ వారి బోనాలు మాత్రం తమవద్దకు రావద్దనే ధోరణి ఎలాంటి సామాజిక న్యాయానికి నిదర్శనం?

దేవుడి ముందు అందరూ సమానమని చెప్పుకుంటూ, దేవుడిని కొలిచే మనుషుల మధ్యనే అసమానతలు సృష్టించడం ఎంతటి వైరుధ్యం!

ఒక మనిషి శ్రమను స్వీకరిస్తూ, అదే మనిషిని సామాజికంగా దూరంగా ఉంచడం మానవత్వానికే విరుద్ధం. సేవలు అవసరమైనప్పుడు దగ్గరకు తీసుకుని, సమానత్వం విషయానికి వచ్చేసరికి దూరం పెట్టడం కులాధిపత్య భావజాలంలోని ద్వంద్వ వైఖరిని బయటపెడుతోంది.

బతుకమ్మ పండుగలోనూ కులవివక్ష నీడలా?

తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ ఒక అందమైన ప్రతీక. ప్రకృతిలో లభించే రంగురంగుల పూలను పేర్చి, పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ మహిళలు సామూహికంగా జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ప్రజల జీవన సంస్కృతికి అద్దం పడుతుంది.

బతుకమ్మ అంటే పూల పండుగ మాత్రమే కాదు. ఆడపడుచుల ఆత్మీయతకు, సామూహిక జీవనానికి, ప్రకృతితో మనిషికున్న అనుబంధానికి ప్రతీక. అలాంటి పండుగలో కులవివక్షకు చోటెక్కడుంది?

అయితే, బతుకమ్మ వేడుకల సందర్భంగా కొందరు మహిళలు ఇతర మహిళలను ఉద్దేశించి, “మీ చీర కొంగులు మాకు తాకుతున్నాయి!” అంటూ వ్యాఖ్యానించినట్లు వెలుగులోకి వచ్చిన ఘటనలు సమాజాన్ని ఆలోచింపజేస్తున్నాయి.

ఒకే పండుగలో పాల్గొంటూ, ఒకే పాటకు గొంతు కలుపుతూ, ఒకే సంస్కృతిని పంచుకుంటూ.. కేవలం కులం కారణంగా ఒకరి ఉనికి మరొకరికి అంటరానిదిగా కనిపించడం ఎంతటి దురదృష్టకరం!

పూలను దేవతగా కొలిచే పండుగలో మనిషిని మాత్రం కులం పేరుతో అవమానించడం మన సంస్కృతిలోని గొప్పతనానికే మచ్చ. బతుకమ్మ పేరిట పూలను పేర్చే చేతుల మధ్యనే వివక్ష గోడలు నిర్మితమైతే, ఆ పండుగ అందించే ఐక్యతా సందేశానికి అర్థం ఏముంటుంది?

రాజ్యాంగం ఇచ్చిన హక్కులు.. సమాజం ఇవ్వాల్సిన గౌరవం!

భారత రాజ్యాంగం అంటరానితనాన్ని నిషేధించింది. రాజ్యాంగంలోని 17వ అధికరణం అంటరానితనాన్ని రద్దు చేస్తూ, దాని ఆచరణను నిషేధిస్తోంది. సమానత్వ హక్కు ప్రతి పౌరుడికీ గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే హక్కును గుర్తుచేస్తోంది.

కానీ చట్టం చేయడం ఒక ఎత్తయితే, దాన్ని సామాజిక జీవితంలో ఆచరించడం మరో ఎత్తు.

చట్టపరంగా నిషేధించబడిన వివక్ష సామాజిక ఆచారాలు, కుటుంబ సంప్రదాయాలు, కులాధిపత్య భావజాలం రూపంలో కొనసాగితే ప్రజల్లో చైతన్యం పెరగాలి. పాఠశాల స్థాయి నుంచే సమానత్వం, మానవ గౌరవం, రాజ్యాంగ విలువలపై అవగాహన కల్పించాలి. వివక్షకు గురైనవారు న్యాయం కోరేందుకు భయపడని వాతావరణాన్ని కల్పించాలి.

కులవివక్షను నిర్మూలించే బాధ్యత కేవలం అట్టడుగు వర్గాలదే కాదు. సమాజంలోని ప్రతి ఒక్కరిదీ. ఆధిపత్య భావజాలాన్ని ప్రశ్నించడం, వివక్షకు వ్యతిరేకంగా నిలబడటం, సమానత్వాన్ని ఆచరించడం ద్వారా మాత్రమే సామాజిక మార్పు సాధ్యమవుతుంది.

ఆత్మగౌరవం.. స్వావలంబన.. ఐక్యత!

కులవివక్షను ఎదుర్కోవడానికి నిరసనలు అవసరమే. అయితే నిరసనలతోపాటు దీర్ఘకాలిక సామాజిక మార్పు కోసం ఆచరణాత్మక ప్రయత్నాలు కూడా జరగాలి.

1. ఆత్మగౌరవమే తొలి అడుగు

ఏ మనిషీ తన కులం కారణంగా తక్కువవాడు కాదు. ఎవరూ తమ జన్మ ఆధారంగా అవమానాన్ని భరించాల్సిన అవసరం లేదు. ఇతరుల నుంచి గౌరవం పొందాలనే ఆశతో మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకూడదు.

అవమానకరమైన ఆచారాలను, వివక్షతో కూడిన సంబంధాలను ప్రశ్నించాలి. అయితే, సామాజిక బహిష్కరణకు గురైనవారిని మరింత ఒంటరిచేసే విధంగా కాకుండా, గౌరవప్రదమైన సంబంధాలను నిర్మించుకునే దిశగా ముందుకు సాగాలి.

2. ఆర్థిక స్వావలంబనతో సాధికారత

విద్య మనిషికి జ్ఞానాన్ని అందిస్తుంది. ఆర్థిక స్వావలంబన అతనికి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను, జీవితాన్ని స్వతంత్రంగా నిర్మించుకునే అవకాశాలను పెంచుతుంది.

అందుకే చదువుతోపాటు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, వ్యాపారాలు, వ్యవసాయం, వృత్తిపరమైన అవకాశాలపై దృష్టి పెట్టాలి. యువత తమ సామర్థ్యాలను గుర్తించి ఆర్థికంగా ఎదగాలి. మహిళల ఆర్థిక సాధికారతకూ ప్రాధాన్యం ఇవ్వాలి.

అయితే ఆర్థికంగా ఎదిగినంత మాత్రాన కులవివక్ష పూర్తిగా అంతరించిపోతుందని భావించకూడదు. ఆర్థిక అభివృద్ధితోపాటు సామాజిక చైతన్యం, చట్టపరమైన రక్షణ, సమానత్వ విలువలు కూడా బలపడాలి.

3. సామాజిక ఐక్యతతో వివక్ష నిర్మూలన

అట్టడుగు వర్గాల మధ్య పరస్పర ఐక్యత, విద్యావంతుల సహకారం, యువతలో సామాజిక బాధ్యత పెరగాలి. కులాల మధ్య విద్వేషాన్ని పెంచే భావజాలానికి బదులుగా మానవత్వాన్ని ప్రోత్సహించాలి.

కులాంతర వివాహాలను గౌరవించాలి. అలాంటి వివాహాలు చేసుకునే యువతకు కుటుంబాలు, సమాజం మద్దతుగా నిలవాలి. ప్రతి వ్యక్తికి తన జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉందనే విషయాన్ని అంగీకరించాలి.

కులవ్యవస్థను బలహీనపరిచే మార్పు మన ఇళ్ల నుంచే ప్రారంభం కావాలి. మన పిల్లలకు ఇతరుల కులాన్ని అడగడం కంటే వారి వ్యక్తిత్వాన్ని గౌరవించడం నేర్పాలి.

మళ్లీ ఉదయించాలి అంబేద్కర్ ఆశయాల చైతన్య దీపం!

భారతదేశంలో కులవివక్షను ప్రశ్నించిన మహనీయుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అగ్రగణ్యులు. విద్య, సంఘటిత శక్తి, హక్కుల సాధన ద్వారా అట్టడుగు వర్గాలు తమ జీవితాలను మార్చుకోవాలని ఆయన బోధించారు.

ఆయన ఆశయాలను జయంతి వేడుకలకో, విగ్రహాల ఆవిష్కరణలకో, ప్రసంగాలకో పరిమితం చేయకూడదు. రాజ్యాంగ విలువలను మన దైనందిన జీవితంలో ఆచరించాలి. మనుషుల మధ్య సమానత్వాన్ని పాటించాలి. కులవివక్ష ఎక్కడ కనిపించినా ప్రశ్నించాలి.

అంబేద్కర్ ఆశయాలకు నిజమైన నివాళి ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేయడంలో కాదు.. ఆయన కలలుగన్న సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయడంలో ఉంది.

చరిత్రలోని చీకట్లను చీల్చుకుంటూ ఉదయించిన సూర్యుడిలా, అంబేద్కర్ ఆలోచనల వెలుగు ప్రతి గ్రామానికీ, ప్రతి గడపకూ చేరాలి. ఆ వెలుగు కులాధిపత్యపు చీకట్లను తొలగించి, ప్రతి మనిషికీ ఆత్మగౌరవంతో జీవించే అవకాశాన్ని కల్పించాలి.

“మీ చీర కొంగులు మాకు తాకుతున్నాయి!” అనే మాట ఒక వ్యక్తి నోట వెలువడిన అవమానకర వ్యాఖ్య మాత్రమే కాదు. అది మన సమాజం ఇంకా ఎంత దూరం ప్రయాణించాల్సి ఉందో గుర్తుచేసే ప్రశ్న.

చీర కొంగు తాకితే అపవిత్రమవుతుందనుకునే మనస్తత్వమే మారాలి. మనిషిని తాకితే మైలపడుతుందనే భావనను సమాజం నుంచి తరిమికొట్టాలి. ఎందుకంటే మానవత్వానికి కులం లేదు. ఆత్మగౌరవానికి అడ్డుగోడలు లేవు. సమానత్వానికి అంటరానితనం లేదు.

బతుకమ్మలో పూలను పేర్చినట్లే మనుషుల మధ్య సంబంధాలను పేర్చుకోవాలి. పూల రంగులు వేరైనా వాటి అందం తగ్గదు. అలాగే మనుషుల కులాలు వేరైనా వారి గౌరవం తగ్గదు. పండుగలు మనుషులను కలపాలి.. కులాలు వారిని విడదీయకూడదు.

మనిషిని మనిషిగా గౌరవించలేని సమాజం ఎంత అభివృద్ధి చెందినా అది సంపూర్ణ నాగరిక సమాజం కాలేదు.

నర్సింహ వెల్మజాల. 16.10.26




బతుకమ్మ పాట!

రామా రామా ఉయ్యాలో

శ్రీ రామ ఓ రామా ఉయ్యాలో
ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఉయ్యాలో
ఒక ఊరికి ఇస్తే ఉయ్యాలో
ఒక్కడే మా అన్న ఉయ్యాలో
వచ్చెయిన పోడు ఉయ్యాలో
తంగేడు పూవులను ఉయ్యాలో
తల్లిగా పూజించి ఉయ్యాలో
గునుగు పువ్వులను ఉయ్యాలో
గురువుగా భావించి ఉయ్యాలో
గడ్డి చామంతులను ఉయ్యాలో
తమ్ముడిగా భావించి ఉయ్యాలో
బీర పువ్వులను ఉయ్యాలో
బిడ్డ గా భావించి ఉయ్యాలో
పువ్వులనే దేవతగా ఉయ్యాలో
పూజించి కొలిచేదాం ఉయ్యాలో

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
మా ఊరు బతుకమ్మ ఉయ్యాలో
మమ్ము కాపాడు ఉయ్యాలో 
మా పంట పొలాల్లో ఉయ్యాలో
పాటలుగా పాడేద్దాం ఉయ్యాలో
చప్పట్ల పాటలలో ఉయ్యాలో
బతుకమ్మ పాటలే ఉయ్యాలో

శ్రీ రామ ఓ రామా ఉయ్యాలో
శ్రీ రామ ఓ రామా ఉయ్యాలో 

మురిసిపోయే వేళలో ఉయ్యాలో
మా ఆడపడుచులు ఉయ్యాలో
బతుకమ్మ ఆటలు ఉయ్యాలో
శరదృతువులో ఉయ్యాలో
అడవి పువ్వులతో ఉయ్యాలో
బతుకమ్మను చేసి ఉయ్యాలో
ఆటలు ఆడుతాం ఉయ్యాలో

కళ్యాణ పట్టణం ఉయ్యాలో
కాటమరాజు ఉయ్యాలో
అతనోక చెల్లెలు ఉయ్యాలో
అల్లారు ముద్దుగా ఉయ్యాలో
పశువుల మంద వెంటా ఉయ్యాలో
అన్నతో తిరిగేది ఉయ్యాలో
అడవిలో పువ్వులతో ఉయ్యాలో
ఆటలు ఆడేది ఉయ్యాలో
కొన్నేళ్లు పోవంగ ఉయ్యాలో
చెల్లెలుకు జ్వరం వచ్చే ఉయ్యాలో
తగ్గని జ్వరం వచ్చి ఉయ్యాలో
కోమా స్థితిలోకి పోయే ఉయ్యాలో
అన్న తట్టుకోలేక ఉయ్యాలో
ఆగమాగమాయె ఉయ్యాలో
తంగేడు గునుగు ఉయ్యాలో
గడ్డి పువ్వులను ఉయ్యాలో
అందంగా పేర్చి ఉయ్యాలో
చెల్లెమ్మకు ఇచ్చే ఉయ్యాలో
జ్వరం తగ్గుతూ వచ్చి ఉయ్యాలో
పది దినాల్లో తగ్గే ఉయ్యాలో
హుషారుగా అయ్యింది ఉయ్యాలో

ప్రతియేటా దసరకు ముందు ఉయ్యాలో
పువ్వులను పూజించే ఉయ్యాలో
బతుకమ్మ ను చేసి ఉయ్యాలో 
చప్పట్ల పాటలతో ఉయ్యాలో 
దేవతలను కొలిచేరు ఉయ్యాలో 

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
అన్నాచెల్లెళ్ల ఉయ్యాలో
పువ్వుల పండగయే ఉయ్యాలో
ఈ కథ విని వారికి ఉయ్యాలో
కలుగు పుణ్యాలు ఉయ్యాలో
రామా రామా ఉయ్యాలో
శ్రీ రామ ఓ రామా ఉయ్యాలో!

నర్సింహ వెల్మజాల 11.10.26

కొన్ని నిర్ణయాలకు ఎక్కువ సమయం అవసరం లేదు;

 కొన్ని నిర్ణయాలకు ఎక్కువ సమయం అవసరం లేదు;

మనసులోని ఆలోచనకు స్పష్టత వస్తే చాలు.


— నర్సింహ వెల్మజాల

ఊరికో చరిత్ర!


 ఊరంటే పాత గోడలు, వయసైపోయిన వృద్ధులే కాదు

ఆత్మాభిమానం గల అమ్మానాన్నలు ఉంటారు

ఊపిరికి - ఊరుకు విడదీయలేని అవినాభావ సంబంధం

మాటల్లో చెప్పలేం, రాయాలంటే ప్రతి ఊరికో చరిత్ర!




నర్సింహ వెల్మజాల ✍🏻31.08.26

లందె గొల్లం!



మాదిగలు తోలును నానబెట్టడం కోసం కుమ్మరివారిచే ప్రత్యేకంగా ఒక తొట్టిని తయారు చేయించేవారు. తోలును శుభ్రం చేయడానికి తంగెడు చెక్కను (తంగెడు చెట్టు బెరడును) వేరు చేసి, నీళ్లతో నింపే ఆ పెద్ద తొట్టినే ‘లందె గొల్లం’ అని పిలుచుకుంటారు. ఇది మన పూర్వీకుల జీవనోపాధిలో ఒక భాగం.


ఈ ‘లందె గొల్లం’ గురించి బ్రహ్మాండ పురాణం, రేణుకా-ఎల్లమ్మ చరిత్ర, పరశురాముడి పురాణ ఘట్టాలు మరియు జానపద కథల్లో విరివిగా ప్రాచుర్యంలో ఉన్న ఒక కథను స్మరించుకుందాం...


జమదగ్ని మహర్షి మరణం తర్వాత ఆయన కుమారుడైన పరశురాముడు, తన తండ్రిని చంపినవారు ఎవరో చెప్పమని తల్లి ఎల్లమ్మను అడుగుతాడు. అయితే, పరశురాముడికి ఇంకా సరైన వయస్సు రాలేదని భావించిన ఎల్లమ్మ తల్లి ఆ విషయాన్ని చెప్పడానికి నిరాకరిస్తుంది. దాంతో కోపోద్రిక్తుడైన పరశురాముడు తల్లిని బాధించడం మొదలుపెడతాడు.


ఆ సమయంలో అమ్మవారు తనను తాను కాపాడుకోవడానికి పారిపోతూ, మార్గమధ్యంలో వివిధ కులాల వారి ఇళ్లలో మరియు వారి వృత్తి స్థలాల్లో దాక్కుంటుంది. ఆ క్రమంలోనే ఎల్లమ్మ తల్లి చివరికి మాదిగల 'లందె'లో కూడా దాక్కుంటుంది

బంధువు ఎవ్వడు !


మహాభారతం కేవలం ఒక యుద్ధగాథ మాత్రమే కాదు; అది ధర్మం, కర్మ, మానవ మనస్తత్వం మరియు జీవిత సత్యాల మహాసాగరం. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునికి, శ్రీకృష్ణునికి నడుమ జరిగిన సంవాదం భగవద్గీత రూపంలో మనకు జీవన మార్గదర్శిగా నిలిచింది. నిత్య జీవితంలో ఎదురయ్యే సందేహాలకు, అనుబంధాల మోహానికి భగవద్గీత స్పష్టమైన పరిష్కారాన్ని చూపుతుంది.

యుద్ధరంగానికి వచ్చి నిలబడిన అర్జునుడు తన ఎదురుగా ఉన్న సైన్యాన్ని చూసి తీవ్ర మోహంలో, మానసిక కుంగుబాటులో పడిపోతాడు.

"ఎదురుగా ఉన్నవారంతా నా తాతలు, గురువులు, అన్నదమ్ములు, నన్ను ప్రాణసమానంగా ప్రేమించిన బంధువులే కదా! వీరిని చంపి పొందే రాజ్య భోగాలు నాకెందుకు కృష్ణా! "


ఇది కేవలం అర్జునుడి ప్రశ్న మాత్రమే కాదు; బంధాలు, అనుబంధాల వల్ల ధర్మం వైపు నిలబడటానికి వెనుకాడే ప్రతి సాధారణ మానవుడి మానసిక స్థితికి ప్రతీక. రక్తసంబంధాలు ధర్మానికి అడ్డుగా నిలిచినప్పుడు మానవుడు కర్తవ్య విమూఢుడవుతాడని అర్జునుడి పాత్ర ద్వారా వ్యాస మహర్షి స్పష్టం చేశారు.


అర్జునుడి మాటలు విన్న శ్రీకృష్ణపరమాత్మ అతని మోహాన్ని పటాపంచలు చేస్తూ ధర్మాన్ని ప్రబోధిస్తాడు:


"వారు నీ బంధువులే కావచ్చు. కానీ వారి స్థానం ఎక్కడుందో చూడు! అధర్మం వైపు నిలబడి వారు నీకు ఎదురుగా శత్రువులుగా ఉన్నారు. నీ ధర్మానికి, శ్రేయస్సుకు వారు అండగా ఉండాలి కానీ, అధర్మానికి కొమ్ముకాస్తూ నీకు ఎదురుగా నిలబడ్డారంటే వారు నీ బంధువులు కారు, ధర్మ విరోధులు మాత్రమే!"


కేవలం రక్తం పంచుకుని పుట్టినంత మాత్రాన లేదా ఒకే కులంలో, కుటుంబంలో ఉన్నంత మాత్రాన ఎవరూ బంధువులు కాజాలరు. మన శ్రేయస్సును కోరేవాడు, ధర్మ మార్గంలో నడిచేవాడే అసలైన బంధువు అని పరమాత్మ నొక్కిచెప్పాడు.


మహాభారత కాలం నాటి ఈ సంవాదం నేటి ఆధునిక సమాజానికి కూడా పరిపూర్ణంగా వర్తిస్తుంది. నేడు సమాజంలో కనిపిస్తున్న అనేక అనుబంధాలు "అవసరాల బంధుత్వాలు"గానే మిగిలిపోతున్నాయి. సిరిసంపదలు, అధికారాలు, పదవులు ఉన్నంతవరకే పలకరించే బంధువులు కష్టకాలం రాగానే ముఖం చాటేస్తారు. స్వార్థం నెరవేరేంత వరకే ప్రేమానురాగాలు నటిస్తూ, అవసరం తీరిపోగానే దూరం జరిగే బంధాలు నిజమైనవి కావు.


మన కష్టాల్లో, నష్టాల్లో భాగస్వాములై, మన ఎదుగుదలను చూసి ఆనందిస్తూ, ధర్మం తప్పినప్పుడు హెచ్చరించి సరైన మార్గంలో నడిపించేవారే నిజమైన బంధువులు. అటువంటి గుణం లేనివారు ఎంతటి రక్తసంబంధీకులైనా శత్రువులతో సమానం.


"బంధువు ఎవ్వడు?" అనే ప్రశ్నకు సమాధానం కేవలం రక్తసంబంధంలో లేదు, అది భావంలో, ధర్మంలో ఉంది. రూపుదిద్దుకున్న బంధాల కంటే గుణంతో, నిశ్చలమైన ప్రేమతో ఏర్పడే అనుబంధాలే శాశ్వతమైనవి. అధర్మాన్ని విడనాడి, సత్యం మరియు కర్మ మార్గంలో మనకు తోడుగా నిలిచే ప్రతి శ్రేయోభిలాషీ మనకు నిజమైన బంధువే. ఈ సత్యాన్ని గ్రహించి జీవించడమే మానవ జీవితానికి సార్థకత.



వెల్మజాల నర్సింహ.29.07.26

దుప్పల్లి!

దుప్పల్లి!

 యాదాద్రి భువనగిరి జిల్లాలోని దుప్పల్లి గ్రామానికి ఎంతో ఘనమైన, వైభవోపేతమైన చరిత్ర ఉంది. కాకతీయ ప్రతాపరుద్రుని కాలం నాటి వైభవానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచిన చారిత్రక ఆధారాలు ఈ ఊరి ప్రాధాన్యతను చాటిచెబుతున్నాయి. ఈ గ్రామ చరిత్ర విశేషాలు ఇక్కడ పొందుపరచడమైనది:


కాకతీయుల కాలం నాటి వైభవం – పురాతన ఆధారాలు

కాకతీయ సామ్రాజ్య చివరి పాలకుడైన ప్రతాపరుద్రుని కాలంలో దుప్పల్లి ప్రాంతం అత్యంత వైభవోపేతంగా విలసిల్లిందని ఇక్కడి శిథిలమైన రాతి శిల్పాలు, కట్టడాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు ఇక్కడ పెద్ద ఎత్తున ఏనుగుల సైన్యం ఉండేదనడానికి గుర్తుగా, వాటిని కట్టేసే భారీ రాతి స్తంభాలు, నిర్మాణాల శిథిలాలు గ్రామంలో అక్కడక్కడా నేటికీ దర్శనమిస్తాయి.


దుప్పల్లి పొరుగున ఉన్న రామన్నపాడు పొలాల్లో రైతులు దుక్కి దున్నే సమయంలో సగం విరిగిన పురాతన విగ్రహాలు, మట్టి కుండలు, ఆనాటి రాజుల కాలంలో చెలామణిలో ఉన్న నాణేలు బయటపడటం ఇక్కడి చారిత్రక ప్రాధాన్యతకు నిదర్శనం.

ఒకప్పుడు ఈ ప్రాంతం కేవలం చిన్న గ్రామంగా కాకుండా, ఒక పెద్ద నగరంగా విస్తరించి ఉండేదనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. నాటి నగర సరిహద్దులు తక్కలపాడు నుండి రామన్నపాడు మరియు సింగరపాడు వరకు వ్యాపించి ఉండేవని స్థానికులు నమ్ముతారు. మూసీ నది వెంబడి 'బాచ్చ్ పాల్' గ్రామం వరకు ఎన్నో రాతి విగ్రహాలు శిథిలమై పడి ఉన్నాయి. అయితే, అంతటి వైభవంగా ఉన్న ఆనాటి నగరం రూపురేఖలు మారి, ప్రస్తుత దుప్పల్లి గ్రామంగా ఏ పరిస్థితుల్లో, ఎప్పుడు రూపాంతరం చెందిందనే విషయానికి సంబంధించిన స్పష్టమైన లిఖితపూర్వక ఆధారాలు (అక్షర రూపం) లభ్యం కాలేదు.


మూసీ నది మధ్యలో ఒక భారీ రాతి బండపై నిర్మించిన గంగమ్మ తల్లి దేవాలయం ఇక్కడి ప్రధాన ఆకర్షణ, ఇంజనీరింగ్ అద్భుతం.

కాశ్మీర విగ్రహాలు: నది ఒడ్డున పురాతనమైన 'కాశ్మీర' శైలిని పోలిన అనేక విగ్రహాలు ఉన్నాయి, ఇవి నాటి శిల్పకళా చాతుర్యానికి ప్రతీకలు.

 వ్యవసాయ బావినే ఆలయంగా మార్చి, అందులోని దైవాన్ని పూజించే విశిష్టమైన సంప్రదాయం బహుశా దుప్పల్లి గ్రామానికి మాత్రమే సొంతం.

ఎల్లమ్మ దేవి జాతర: ప్రతి ఏటా ఎంతో ఘనంగా జరిగే ఎల్లమ్మ దేవి జాతర చరిత్ర కూడా దురదృష్టవశాత్తు ఎక్కడా గ్రంథస్థం కాలేదు. గ్రామ సరిహద్దుల్లోని వందల ఏళ్ల నాటి వేప చెట్లు ఎన్నో తరాల పండుగ సంబరాలకు, సాంస్కృతిక వైభవానికి మౌన సాక్ష్యాలుగా నిలిచాయి.


మూసీ నదికి అడ్డు కట్ట వేసి కాలువలు గా మార్చి చెరువుల నిర్మాణం చేసి బీడు భూములను వ్యవసాయ భూములుగా 

మార్చారు వెనుకటనే..

విద్యా రంగంలో అగ్రగామి

దొరల (జమీందారుల) కాలంలో కూడా ఈ ఊరి చరిత్రను వివరించే 'సావనీర్' (జ్ఞాపికలు) లేదా రికార్డులు పెద్దగా అందుబాటులోకి రాలేదు. అయినప్పటికీ, చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల కంటే ముందే దుప్పల్లికి పదవ తరగతి వరకు పాఠశాల రావడం ఈ ఊరి విద్యా చైతన్యానికి నిదర్శనం. ఆనాటి మొదటి బ్యాచ్ విద్యార్థులు ఎంతో అదృష్టవంతులు. అప్పటి నుండి ఇప్పటివరకు ఎన్నో వసంతాలు గడిచినా, ప్రతి సంవత్సరం పాఠశాల విద్య పూర్తి చేసుకుని వెళ్లే పదవ తరగతి పిల్లలు.. కన్నతల్లిని వదిలి వెళ్తున్నంతటి భావోద్వేగానికి గురికావడం ఇక్కడి గురు-శిష్యుల బంధానికి, ఊరితో ఉన్న అనుబంధానికి అద్దం పడుతుంది.

భవిష్యత్తు తరాలకు అందించాల్సిన వారసత్వం

ఇంతటి ఘనచరిత్ర కలిగిన దుప్పల్లి గ్రామ పంచాయతీ రికార్డులలో ఈ వివరాలకు సంబంధించిన ఏవైనా ఆధారాలు ఉన్నాయో లేదో శోధించాల్సి ఉంది. ఈ చారిత్రక విషయాలన్నింటినీ సేకరించి, ఒక సమగ్రమైన "గ్రామ చరిత్ర పుస్తకం" రూపంలో తీసుకువస్తే, అది ఇప్పటి తరం యువతకు మరియు రాబోయే తరాలకు మన ఊరి గొప్పదనాన్ని తెలియజేసే అద్భుతమైన కానుక అవుతుంది.


నర్సింహ వెల్మజాల✍🏻

వాన ముచ్చట్లు !

 నిన్ననే ఈదురు గాలులతో

 వచ్చిన వరుణుడు

అటు పట్నం పోలేదు 

ఇటు ఊళ్ళలో లేడు

బొడ్డు రాయికి

 మా ఆడపడుచులు చెప్పి

 వస్తుండ్రు

జర ఇక్కడే కొన్నాళ్ళు

 ఉండాలని

రైతన్నలతో ముచ్చటించాలని. 


వెల్మజాల నర్సింహ ✍🏻

జంబుక - చరక !(కథ)



అనగనగా 'మానసపుర' అనే మృగ సామ్రాజ్యం. ఆ రాజ్యానికి ఉగ్రుడు అనే సింహం రాజు. ఆ రాజు దగ్గర జంబుక అనే నక్క మంత్రిగా ఉండేది. జంబుక మహా జిత్తులమారి. ఎలాగైనా సింహాన్ని మాయం చేసి, తానే ఆ మానసపుర రాజ్యానికి రాజు కావాలని దానికి గూఢమైన కోరిక ఉండేది.


అదే రాజ్యంలో చరక అనే ఒక తెలివైన కుందేలు తన పరివారంతో కలిసి నివసిస్తూ ఉండేది.


ఒకరోజు ఉదయం చరక తన కుటుంబంతో కలిసి పచ్చటి గడ్డిని మేయడానికి బయటకు వచ్చింది. అది గమనించిన జంబుకకు ఒక దురాలోచన వచ్చింది. జంతువులన్నింటినీ భయపెట్టి తన గుప్పిట్లో ఉంచుకోవాలనుకుంది. వెంటనే గట్టిగా అరుస్తూ—

"చరకా! జాగ్రత్త! అటువైపు నుంచి మహారాజుగారు వస్తున్నారు. వెంటనే పారిపోండి!" అని అబద్ధం చెప్పింది.

రాజు పేరు వినగానే భయపడిన కుందేళ్లు ప్రాణాలు దక్కించుకోవడానికి వేగంగా పొదల్లోకి దూరి దాక్కున్నాయి. అది చూసి జంబుక మురిసిపోతూ, క్రూరంగా నవ్వుకుంది.

"ఈ రాజ్యానికి కాబోయే రాజును నేనే! నాకంటే బలవంతుడైన సింహాన్ని వాడుకుని నేనే అందరినీ శాసిస్తున్నాను. ఈ జంతువులకు నా పేరు చెప్తేనే వణకాలి!" అని మనసులో అనుకుంది.


ఆ తర్వాత జంబుక ఉపాయంతో రాజును వేటాడకుండా చేసి, తనే స్వయంగా జంతువుల నుంచి పన్నుల రూపంలో ఆహారాన్ని వసూలు చేయడం మొదలుపెట్టింది. సింహాన్ని గుహకే పరిమితం చేసింది. కాలం గడుస్తున్న కొద్దీ అడవిలోని జంతువులన్నీ జంబుకను చూసి భయపడటం మొదలుపెట్టాయి.

అధికారం చేతికి వచ్చేసరికి జంబుకకు బద్ధకం, అహంకారం పెరిగిపోయాయి. చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోవడం మానేసింది. రోజురోజుకూ పెరిగిపోతున్న జంబుక అహంకారాన్ని, బద్ధకాన్ని తెలివైన చరక (కుందేలు) గమనిస్తూనే ఉంది. నక్కకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది.

అది కడు వేసవి కాలం. అడవి అంతా ఎండిపోయి ఉంది. ఒకరోజు ఒక వేటగాడు అడవిలోకి వచ్చి ప్రమాదవశాత్తూ ఎండుగడ్డికి నిప్పు పెట్టాడు. ఆ మంటలు క్షణాల్లో అడవి అంతా వ్యాపించసాగాయి.

ఆ ప్రమాదాన్ని ముందుగానే గమనించిన చరక, తన పరివారంతో కలిసి సురక్షిత ప్రాంతానికి పరుగులు తీయడం ప్రారంభించింది. దారిలో సోమరిగా పడుకుని ఉన్న జంబుకను చూసి చరక గట్టిగా హెచ్చరించింది:

"మంత్రిగారూ! అడవి తగలబడిపోతోంది, వెంటనే పారిపోండి!"


కానీ, అహంకారంతో ఉన్న జంబుక కళ్ళు తెరవలేదు.

"ఈ కుందేళ్లు ఎప్పుడూ ఇంతే... పిరికివి! ఏదో చిన్న పొగ చూసి భయపడిపోతున్నాయి. కాబోయే రాజును, నన్నే బెదిరిస్తాయా?" అని నిర్లక్ష్యంగా నవ్వి, అక్కడే ఉన్న ఒక పెద్ద పొద చాటుకు వెళ్లి మళ్లీ పడుకుంది.


కానీ చూస్తూ చూస్తూనే మంటలు అడవిని చుట్టుముట్టాయి. జంబుక పడుకున్న పొదకు కూడా నిప్పు అంటుకుంది. బద్ధకంతో, అతివిశ్వాసంతో ఉన్న జంబుక తప్పించుకునే లోపే మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయింది. చరక తన సమయస్ఫూర్తితో, హెచ్చరికలను గమనించడం వల్ల తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది.

నీతి :

మన చుట్టూ ఏం జరుగుతుందో ఎల్లప్పుడూ గమనిస్తూ, సమయస్ఫూర్తితో జీవించాలి. అతివిశ్వాసం, బద్ధకం మరియు నిర్లక్ష్యం మనిషిని (లేదా జంతువునైనా) నాశనం చేస్తాయి. 


వెల్మజాల నర్సింహ.

కాలగమనంలో..

 




రోహిణి కార్తె కొంచెం కోపంగానే ఉండే,
జనాలు విన్నరుగా... మొక్కలు నాటారు!
భూతల్లి పగిలిన చర్మంతో, వేయి కళ్ళ ఇంద్రుడిని తలపిస్తోంది.
మొక్కలు గుక్కెడు నీళ్లు లేక మాడిపోయాయి,
చెరువులన్నీ ఎండిపోయి నీళ్లే కరువయ్యాయి.
గొడ్డు గోదా కాంక్రీటు రోడ్లపై సంచరిస్తుంటే,
ఈ కలియుగంలో పిడికెడంత పిట్ట ప్రాణం ఎంత?
ఇప్పుడైనా కొంచెం ఉపశమనం కోసం,
కాలం చాపకింద నీరులా జారుకుంటోంది...
వేసవి తాపం నుండి వర్షపు జల్లుల్లోకి!
కాలగమనంలో.. మరింత ముందుకు,
పిల్లలు బడికి పోవాలి, పక్షి పిల్లలు ఆకాశాన ఎగరాలి!

వెల్మజాల నర్సింహ ✍🏻12.06.26

జెండాలు - విగ్రహాలు .



డా. xxxx రెడ్డి మొన్ననే తెలుగు లెక్చరర్ అయ్యిండు మరియు డా. xxxxxxx రెడ్డి  సార్ ఈరోజు కలెక్టర్ గా పదోన్నతి పొందుతున్నారు 

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉంటారు 

ప్రతి రోజూ వార్తలలో వారే! 

ఏ రిజర్వేషన్ లు నమ్ముకొని వారు ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. లేదా వారి స్వయం కృషితోనే

సాధించారా మనం గమనించాలి.


భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి దాదాపుగా 

70వ సంవత్సరం లోకి అడుగు పెడుతున్నాం 

రిజర్వేషన్లు వాడుకోని మనలో ఎంత మంది ఉన్నంత పదవులు పొందారు. ఎంత మంది ప్రభుత్వ కొలువులో ఉన్నారు.

ఎంత మందికి  గెజిటెడ్ ఉద్యోగాలువచ్చాయి. ప్రతి ఊరిలో ఒక వర్గం వారు అంబేద్కర్ విగ్రహం పెడితే మరికొందరు జ్యోతిరావు ఫూలే విగ్రహం పెట్టాలి అంటుంటారు. వేరే వారికి ఇవ్వేమి ఉండావి.

గణతంత్ర దినోత్సవం నాడు దండలేసి నినాదాలు 

చేసి మరిచి పోతాము. వారు చేసిన పోరాటా సమయం వేరు ఇప్పుడున్న కాలం వేరు వారు గొప్పవారే ,కానీ వారి ఆయుధం అక్షరం  నేడు మన ఆయుధం వారి వారసులం అంతే తేడా బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో దేశాలు తిరిగి  ఉన్నంత చదువులు చదివారు. వారి సగం జీవితం చదువులకే  మనం వారి పేరు చెప్పుకొని వారు మనకే సొంతం అనుకుంటున్నాం.' అక్షర పితా' కావాల్సిన వారిని అంటరాని వారికి దేవుడిగా చేసుకున్నాం.


ఊర్లలలో  మంచికి  చెడుకు మనమే ముందుంటాం 

కానీ చదువులో వెనుక ఉంటాం జెండాలు మోసేది మనమే నాయకుడు అయ్యేది మరో వాడు.

మనలో మనం తన్నుకు చస్తాం వాడు పైనుంచి  ఆనందిస్తాడు. మనలో మనమే శత్రువులవుతం.  మన ఇరుగుపొరుగు వాళ్ళం విరోధం మూడో వాడికి ఆనందం.


తప్పు ఎక్కడ ఉంది జెండాలు మోయడం లోన 

విగ్రహాలు పూజించడం లోన మన ఐక్యత ఎక్కడా లోపిస్తుంది.మనం ఎందుకు ముందుకు పోలేక పోతున్నం రిజర్వేషన్లు ఉన్నాయానే సోమరి తనం 

వలన లేదా పూర్తిగా అంబేద్కర్ గారిని అర్థం చేసుకోనందున లేదా చుట్టూ ఉన్న సమాజం వలన 

ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఇప్పుటి తరానికి ఉంది.



వెల్మజాల నర్సింహ.22.01.26.

విజయదశమి .



 మన సినిమాల్లో  హీరోయిన్ లను అందంగా సుకుమారంగా పాటలకే పరిమితంగా చూపిస్తారు.

చివరకు హీరో ఫైటింగ్ చెస్తుంటే పురుషాధిక్యమే ఆనుకొని చూసి ఆనందిస్తాం 

కానీ మన పూజనీయులు త్రిమూర్తులే (విష్ణు, ఈశ్వర, బ్రహ్మ) కాదు అంతకు మించి వారి తయారు చేసిన శక్తి ఉన్నది అదే(దుర్గా దేవి) అమ్మా వారని చరిత్ర చెబుతుంది.

ముఖ్యంగా ఆడపిల్లలకు ధైర్యసాహసాలు నింపే అద్భుతమైన చరిత్ర.

.ఓం శ్రీ దుర్గాయై నమః

  సర్వ మంగళ మాంగల్యే 

 శివే సర్వార్థసాధకే 

 శరణ్యే త్రయంబకే 

 దేవి నారాయణి నమోస్తుతే 

 " దేవీ మహాత్మ్యం గ్రంధం లో దుర్గమ్మ గురించి సవివరంగ ఉంటుంది.

రూపం : దుర్గాదేవి ఆదిమ లలితా దేవి యొక్క రూపాలలో ఒకటి. ఆమె మొత్తం విశ్వానికి తల్లి మరియు తండ్రి అని చెబుతారు. 
 మహిషాసుర సంహారం: మహిషాసురుడు అనే రాక్షసుడు మూడు లోకాలను భయభ్రాంతులకు గురిచేసినప్పుడు, బ్రహ్మ, విష్ణు, శివుడు కలిసి పది చేతులతో శక్తివంతమైన స్త్రీ రూపాన్ని సృష్టించారు. ఆమె దుర్గాదేవి. 
 యుద్ధం : సింహంపై స్వారీ చేస్తూ, దుర్గాదేవి మహిషాసురుడిని, అతని సైన్యాన్ని ఓడించి, ప్రపంచాన్ని రక్షించింది. 
 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి .
   
 దుర్గాదేవి పేరుకు అర్థం "అజేయమైనది" లేదా "దగ్గరకు చేరుకోవడం కష్టం".
ఆమెను హిందూమతంలో అత్యంత శక్తివంతమైన దేవతగా పరిగణిస్తారు.
నవరాత్రుల సమయంలో ఆమెను 9 వివిధ రూపాలలో (నవదుర్గలు)
నవరాత్రులలో దుర్గామాత తొమ్మిది రూపాలను పూజిస్తారు, వీటిని
 నవదుర్గలు అంటారు. ఆ తొమ్మిది రూపాలు: శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, మరియు సిద్ధిదాత్రి. ఈ తొమ్మిది రూపాలు శక్తి, బలం, జ్ఞానం, మరియు దయను సూచిస్తాయి. 

వెల్మజాల నర్సింహ ✍🏻

రాఖీ పండుగ @2025

 మన సంస్కృతి మరియు సంప్రదాయాలను 

రాబోయే తరాలకు అందించడమే పండుగల ఉద్దేశం 

బంధువులంతా  కలుసుకోని 

సాధకబాధకాలు చెప్పుకోవడం 

మరో విశేషం.

పేద ధనిక లేకుండా అందరూ తమకు

 తోచిన విధంగా ఉన్నంత లో కొండంత

 ఆప్యాయంగా గడపడమే పండుగ.


తోబుట్టువుల పండుగ రాఖీ పండుగ 

మరోసారి బాధ్యత గుర్తుచేసే పండుగ.


శుభాకాంక్షలతో....

వెల్మజాల నర్సింహ 

దుప్పల్లి 'శ్రీ ఎల్లమ్మ దేవి పాట'


పండగంటే పండగే ఎల్లన్న
ఊరంతా పండగే మల్లన్న
  మనము కొలిచే దైవం ఓరన్న
 గుడిలో కొలువైన  ఎల్లమ్మ
 మంగళవారం నాడు మాయమ్మ
 ఊరంతా భక్తితో బోనాలే ఎల్లమ్మ
 బుధవారం నాడు పండుగ ఎల్లన్న
 కోళ్లు యాట ఉండగా మాయన్న
 డప్పుల చప్పుడు ఎల్లన్న

 జమిడిక మోతలు మారన్న
 తల్లిని తలుచుకుంటూ ఎల్లన్న
 ఊగే శిగాలు మారన్న
బైండ్ల వారి క్రతువులు ఎల్లన్న
 గావు కేక లే   ఇక మాయన్న
 రంగుల పటం మేసి ఎల్లన్న
 ఘనముగా కొల్చుదాం రావన్న
 పోత రాజు కేమో ఎల్లన్న
 దండాలు పెట్టుదము పులన్న
 ఇంటింటా బంధువులు ఎల్లన్న
ఊరంతా భక్తులు చంద్రన్న
 దుప్పల్లి గ్రామం లో ఎల్లమ్మ
 పచ్చని పొలాలలో మాయమ్మ
 చూడ చక్కని తల్లి ఎల్లమ్మ
 ఊరిని కాపాడే మావురాల ఎల్లమ్మ
 పండుగంటే పండగే ఎల్లన్న

              వెల్మజాల నర్సింహ

ప్రతిసారి ఓటమే నా నేను ఎలా ముందుకు సాగగలను?



మీరు ఓడిపోయినప్పుడు వైఫల్యం శాశ్వతంగా అనిపిస్తుంది. మీరు గెలిచినప్పుడు విజయం శాశ్వతంగా అనిపిస్తుంది
ఇది సహజం.

ఒక పురుషుడు అభివృద్ధి చేసుకోగల గొప్ప కండరం ఆటుపోట్లకు వ్యతిరేకంగా ప్రయాణించే అతని సంకల్ప శక్తి,
సంకల్పమే విషయాన్ని కి చిరునామా

మీరు ఒత్తిడికి గురైనప్పుడు, మీ అలవాట్లు నిజంగా పరీక్షించబడతాయి. విషయాలు పరిపూర్ణంగా లేనప్పుడు కూడా వేగాన్ని కొనసాగించడం కీలకం,

మీరు ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటున్నారా?
 మరింత సిగ్గు లేకుండా ఉండండి. మీరు దాన్ని సంపాదించే వరకు.

మీరు ఒక స్త్రీ తో డేటింగ్ చేయాలనుకుంటున్నారా?

 
మీకు నచ్చిన స్త్రీతో డేటింగ్ చేయవద్దు. మిమ్మల్ని ఇష్టపడే స్త్రీ తో డేటింగ్ చేయాలి వెంబడించవద్దు, ఆకర్షించ వద్దు, ఆకర్షణ కొంత కాలమే.

మీరు కలిసే అత్యంత విజయవంతమైన పురుషులు అంత తెలివైనవారు కాదు. వారు వేగంగా కదులుతారు, రిస్క్ తీసుకుంటారు మరియు చాలా పని చేస్తారు,

ఇతరులు మీపై కలిగి ఉన్న నమ్మకాన్ని అంతర్గతీకరించుకోకుండా ఉండటానికి మీ గురించి బలమైన అభిప్రాయాన్ని పెంచుకోండి,

పరిమితులు, పరిమిత నమ్మకాలు మరియు పరిమిత వ్యక్తిగత కథనాల నుండి మిమ్మల్ని మీరు విడిపించుకోండి,
ప్రపంచం చాలా పెద్దది నీ.. నా ఆలోచనల కన్నా


మీరు బాగా పని చేయడానికి ప్రయత్నిస్తున్నంత
 కాలం, చివరికి మంచి ఫలితం దక్కుతుంది.


అంతే జీవితం... రిలాక్స్.
వెల్మజాల నర్సింహ ✍🏻19.07.25

వాన జాడే లేదు!

 పచ్చిగా ఉండాల్సిన పొలంలో

నాగలి కర్రు దిగనే లేదు  
దుక్కి దున్నిన ఏమి లాభం
గింజలలో జీవం పోయడానికి
నీళ్ళే ప్రాణాధారం
నారుమడి పచ్చదనం ఎక్కడ
చిగురుటాకులాకు అదే చివరి రోజు
గిజ్జిగాడి గొంతు ఎప్పుడో ఎండింది
నల్లని రేగడులు నెర్రలతో
గొంతెండిన   పిల్లలా కనిపిస్తున్నాయి
ఎర్రని రేగడిలో కనిపించే
ఆరుద్ర పురుగుల జాడే లేదు
పత్తి చేలో మొక్కలు అమ్మ నాన్న
లేని అనాధల కనిపిస్తున్నాయి
కంది,పెసర ఊసే లేదు
ఆముదాల ఆశ లేదు
నువ్వులు ,మిరప గింజలు
నువ్వా నేనా అంటున్నాయి

మృగశిర కార్తె లో మురవలసిన చినుకు
ఆరుద్ర కార్తె వరకు కు జాడ లేదు

పరమేశ్వర గంగను విడువుము
మా ప్రాణాలు కాపాడుము
మబ్బులోన దాగున్న చినుకమ్మ
మా మొర విని ఇక్కడ కురువమ్మ


వెల్మజాల నర్సింహ.
  గ్రామము.దుప్పల్లి.
చరవాణి.9867839147.

  


అమ్మ మాటే జోల పాట

 అమ్మ మాటే జోల పాట
స రి గ మ ల తో జగతికి పూల తోట
మురిపంగా ముర్రు పాలతో
  అంగిట గోరు ముద్దుల తో
అపురూపమైన దేవత అమ్మ

మొదటి మాటే అమ్మా
ఆ పిలుపుతో జన్మ ధన్యం అమ్మ
బెజ్జ మహాదేవి చరిత్రలో అమ్మా
శివునికి సేవలు చేసిన ఆ అమ్మా
నేటి కి పాఠ్యాంశంగా నిలిచేనా అమ్మా

 పేరుగాంచిన మరో తల్లి యశోదమ్మ
మన్ను తిన్నాడని ఆ అమ్మ
కృష్ణుడు చెవిని మేలిపిన చరితం కదా అమ్మ

కడుపులో నే ఉన్నప్పుడు ప్రహ్లాదుడు
నారాయణ మంత్రం విన్న లీలావతమ్మ
అమ్మ మాటే జోల పాట
స రి గ మ ల తో జగతికి పూల తోట

చందమామ కోసం చిలిపి రాముడి గోలా
అద్దం లో ప్రతి బింబం చూసి ఆనందం వేళ
కౌసల్యామ్మా మురిసేనా   ఆ అమ్మా

ఛత్రపతి కోసం జిజియాబాయి అమ్మా
శివాజీ వీరుని చేసిన మహా తల్లి ఆ అమ్మా
అమ్మా మాటే జోల పాట
స రి గ మ ల తో జగతికి పూల తోట

రెండు అక్షరాల పిలుపే అమ్మ
నడిచే దైవం ఆ అమ్మ
ప్రేమను పంచే అమ్మా
లోకంలో సరిలేరు నీకెవ్వరు కదామ్మ
పిల్లల భవిష్యత్తుకై నిత్యం తెప్పించే
మహా జన్మ అమ్మా!
అమ్మ మాటే జోల పాట
స రి గ మ ల తో జగతికి పూల తోట

బద్రీనాథ్ పాట సాహిత్యం


 

ముక్తిప్రద  యోగసిద్ద నమో నారాయణాయ 2
అలకనందా  జలపుణ్యఫల నమో నారాయణాయ
బద్రీకాశ్రమానివాస దేవా నమో నారాయణాయ
నీ నామమెంత మధురమో నమో నారాయణాయ
ముక్తిప్రద  యోగసిద్ద నమో నారాయణాయ 2

అరవింద వల్లి  అమ్మ దయతో నమో నారాయణాయ

 దర్శించుకున్న కలుగు పుణ్యం నమో నారాయణాయ

 అణువణువునా నీ నామమే నమో నారాయణాయ

వినిపించెను ఆ ప్రాంతమంతా నమో నారాయణాయ

ముక్తిప్రద  యోగసిద్ద నమో నారాయణాయ 2



ఆలోక్య సర్వ శాస్త్రాణి విచార్యచ పునః పునః
ఇదా మేకం సునిప్పన్నం ధ్యేయో నారాయణ సదా!!

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం


  కష్టపడే శ్రమజీవుల
  పని గంటల కోసం
జరిగిన పోరాటలేన్నో

బతుకు దేరువు కోసం
 జరిగిన పరిణామాలెన్నో

ఎర్ర జెండా రెపరెపల కోసం
ప్రాణాలు వదిలిన
మనుషులేందరో

నేడు ' ప్రపంచ కార్మిక దినోత్సవ
పోరాట యాదిలో


వెల్మజాల నర్సింహ ✍🏻