క్షీర సాగరంలో అనంత శయనుడైన ఆ శ్రీమహావిష్ణువు, జగన్మాత అయిన మహాలక్ష్మీదేవి సమేతుడై అలరారుతున్న సమయమది. లక్ష్మీదేవి పరమ పవిత్రమైన భక్తితో స్వామివారి పాదసేవ చేస్తోంది. ఆ సమయంలో నారాయణ మంత్రాన్ని జపిస్తూ, మహర్షి నారదుడు అక్కడికి విచ్చేశాడు.
ఆ దృశ్యాన్ని చూసిన నారదుడు చిరునవ్వుతో మహాలక్ష్మితో ఇలా అన్నాడు:
అమ్మా! జగన్మాతవు, ఎంతటి ఐశ్వర్యానికి అధిదేవతవైనా భర్త పాదసేవ చేయడంలోనే కదా స్త్రీలకు పరమార్థం! అయినా, ఇంతకీ మన శ్రీహరి నిజంగానే నిద్రపోతున్నాడా లేక నటిస్తున్నాడా? నాకెందుకులే... మళ్లీ వస్తాను. నారాయణ... నారాయణ..." అంటూ నారదుడు అక్కడి నుండి వెనుదిరిగాడు.
నారదుడి మాటలకు లక్ష్మీదేవి మనసులో కొద్దిగా చలనం కలిగి, ఆలోచనలో పడి స్వామివారి పాదాలను కొంచెం గట్టిగా నొక్కింది. యోగనిద్రలో ఉన్నట్లు నటిస్తున్న శ్రీమహావిష్ణువు అది గమనించాడు.
"నారదుడు కలహభోజనుడు కదా! ఈరోజుకి తను అనుకున్నది సాధించి, కడుపు నింపుకుని వెళ్ళినట్లున్నాడు" అని మనసులో నవ్వుకుంటూ, స్వామి ఒక పక్కకు ఒత్తిగిలి పడుకున్నాడు.
ఆ సమయంలో స్వామివారి చేతికి ఉన్న అమూల్యమైన వివాహ ఉంగరం (అంగుళీకం) జారి పాలసముద్రంలో పడిపోయింది. సరిగ్గా అదే సమయంలో అక్కడ సంచరిస్తున్న ఒక చేప ఆ ఉంగరాన్ని ఆహారంగా భావించి, మింగడానికి పైకి ఎగిరింది
జారిపోతున్న ఉంగరాన్ని పట్టుకోవడానికి శ్రీహరి తన చేతి వేళ్లను ఆడించగా, ఆ వేళ్లు సముద్రంలో పైకి ఎగిరిన చేప నుదుటి భాగంలో తాకాయి. ఆ భగవంతుని స్పర్శతో ఆ చేప నుదుటిపై మూడు నామాలు (త్రిపుండ్రాలు) శాశ్వతంగా ఏర్పడ్డాయి.
లోక కల్యాణానికి నాంది
ఈ వింతను పక్కనే ఉండి గమనిస్తున్న మహాలక్ష్మీదేవి ఆందోళనతో స్వామివారితో ఇలా అంది:
"స్వామి! మన వివాహ సమయం నాటి పవిత్రమైన ఉంగరాన్ని ఆ చేప మింగేసింది. అయినా, భూలోకంలో ఒక సాధారణ మత్స్యం (చేప) మీ దివ్య అంగుళీకంతో ఎలా బతకగలదు నాథా?" అని ప్రశ్నించింది.
అప్పుడు ఆ శ్రీమహావిష్ణువు నరసింహ రూప స్మరణతో లక్ష్మీదేవి వైపు చూసి ఇలా పలికాడు:
"దేవీ! లోక కల్యాణార్థమే ఈ లీలా విశేషం జరిగింది. ఏది జరిగినా అది మానవాళి మేలుకే జరుగుతుంది. భవిష్యత్తులో భూలోకంలోని వేములకొండ ప్రాంతంలో నేను 'శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి' గా స్వయంభూవుగా వెలుస్తాను. నన్ను నమ్మిన భక్తులకు కొంగుబంగారమై అండగా ఉంటాను.
నా ఆలయం ఎదుట ఉన్న పవిత్ర కోనేటిలో (కొలనులో) భక్తులు ఈ 'మూడు నామాల చేపలను' దర్శించుకుంటే, వారికి కోటి పుణ్యాలు లభిస్తాయి. వారి సకల పాపాలు తొలగిపోతాయి."
స్వామివారి దివ్యవాణిని విన్న మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషించి, స్వామివారితో కలిసి ఆ వేములకొండ గుట్టపై శాశ్వతంగా కొలువుదీరింది.
జై... శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి కీ జై!
రచన: వెల్మజాల నర్సింహ, దుప్పల్లి




కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి